CM Jagan: అమరావతి సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో జగనన్న విద్యా కానుకపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుక కింద అన్నిరకాల వస్తువులు అందించేలా కార్యాచరణ సిద్ధం చేశామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యా కానుక కచ్చితంగా అందాలని సీఎం జగన్ సూచించారు. యూనిఫామ్స్ కుట్టు ఛార్జీలను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో వేయాలన్నారు. స్కూళ్ల నిర్వహణలో పేరెంట్స్ కమిటీలను నిరంతరం యాక్టివేట్ చేయాలన్నారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచుగా వారితో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిలో నాణ్యత నిర్ధారణ అంశాలను విలేజ్ క్లినిక్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు విలేజ్ క్లినిక్ ద్వారా నివేదికలు పంపించాలన్నారు. నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య, నీటిలో నాణ్యతా లోపం వల్ల వచ్చే రోగాలను నివారించడానికి అవకాశం ఉంటుందన్నారు.
Read Also: Gold Seize: చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం సీజ్
అటు తరగతి గదుల డిజిటలీకరణలో భాగంగా స్మార్ట్, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు 72,481 యూనిట్ల టీవీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. దశల వారీగా తరగతి గదుల్లో టీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.దీని కోసం రూ.512 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి తొలి దశలో తరగతి గదుల డిజిటలైజేషన్ జరగేలా చూడాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడాలన్నారు. డిజిటల్ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్‌లలో కూడా ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు టీచర్లు, విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా 5,18,740 ట్యాబ్‌లు కొనుగోలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ట్యాబ్‌లలో బైజూస్ కంటెంట్ కూడా పొందుపరిచి విద్యార్థులకు అందిస్తారు.
