Site icon NTV Telugu

CM Chandrababu: ముగిసిన దావోస్ పర్యటన.. రేపు ఏపీకి సీఎం చంద్రబాబు..

Cbn

Cbn

CM Chandrababu: దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బయల్దేరారు. రేపు ( జనవరి 23న) ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు.. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్, సమావేశాల్లో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Also: Puppy Abuse Case: అరే ఏంట్రా ఈ దారుణం.. రెండు నెలల కుక్కపై యువకుడు లైంగిక దాడి..

అయితే, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా సదస్సు దోహదం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2025 దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం లాంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను వనరుల్ని సమర్ధంగా వివరించామని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. యువ శక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

Read Also: Vijayasai Reddy: లిక్కర్ స్కాం గురించి జగన్కి తెలియదు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇక, యూరప్ లోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో చంద్రబాబు ఆత్మవిశ్వాసం నింపారు. ఇక, దావోస్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకూ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, రేపు ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి అమరావతికి బయల్దేరనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు.

Exit mobile version