NTV Telugu Site icon

AP Government: ఏపీలో ఉచిత ఇసుక పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచే అమలు..!

Ap Govt

Ap Govt

AP Government: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు. అయితే, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇసుకను అందించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని పేర్కొనింది. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు నిఘా ఉంచనున్నాయి. అయితే దగ్గర్లో ఉన్న వాగులు, వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకునేందుకు ఛాన్స్ కల్పించారు.

Read Also: MS DHONI Movie Rerelease : ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..

ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందిస్తారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉందన్నారు. సంవత్సరానికి 3. 20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్‌ పెరిగుతుందని అంచనా వేశారు. ఆయా జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటిస్తారు. ఆ ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి సమావేశంలో నిర్ణయిస్తారు.

Read Also: HBD MS DHONI : 100 అడుగుల అభిమానం.. ధోని కట్ అవుట్ మాములుగా లేదుగా..

అయితే, సీనరేజ్‌ కింద టన్నుకు కేవలం 88 రూపాయలను ప్రభుత్వం తీసుకోనుంది. ఇప్పటి వరకు గుత్తేదారులు తవ్విన ఖర్చుల కింద టన్నుకు 30 రూపొయల చొప్పున వసూలు చేసే అవకాశం ఉంది. ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుక టన్నుకు రూ.225 చొప్పున వసూల్ చేయనున్నారు. కాగా, రీచ్‌ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలిస్తే.. రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటరుకు రూ.4. 90 చొప్పున అదనంగా వసూలు చేయబోతున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయలను తీసుకుంటారు. వీటన్నింటికీ కలిపి 18 శాతం జీఎస్టీ సైతం విధించనున్నారు. ఇవన్నీ కలిపి.. టన్ను ఇసుక ఎంత ధర అనేది కలెక్టర్లు నిర్ధారణ చేయనున్నారు.