Site icon NTV Telugu

Amaravathi: అమరావతి కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Supreme Court

Supreme Court

Amaravathi: అమరావతి రాజధాని అంశంపై దాఖలైన పిటిషన్‌లపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌లో కోరింది. ఈ పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై ఉపశమనం ఇవ్వాలని అభిప్రాయపడింది. అయితే అమరావతి రాజధాని అంశంపై రైతులు, ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ విముఖత చూపారు. ఈ పిటిషన్‌లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో అమరావతి రాజధాని పిటిషన్‌లపై విచారణ వేరే బెంచ్‌కు బదిలీ అయ్యింది.

Read Also: Gudivada Amarnath: జనసేన క్యాడర్ చంద్రబాబుకి బానిసలా?

కాగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సీజేఐ విముఖత చూపడంపై టీడీపీ సీనియర్ నేత తెనాలి శ్రావణ్ కుమార్ స్పందించారు. రాజధానిగా అమరావతే ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వమ్ము చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిపై వచ్చిన పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యు.యు లలిత్ విముఖత చూపడం హర్షణీయమన్నారు. తాను సభ్యుడిగా లేని మరో బెంచికి బదిలీ చేయాలని ఆదేశించడం ఆనందదాయకం అని శ్రావణ్ కుమార్ తెలిపారు. సీఎం జగన్ ఇప్పటికైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. న్యాయస్థానాల తీర్పులకు ప్రభుత్వం విలువ ఇవ్వాలని పేర్కొన్నారు. ఏపీ రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును శషబిషలు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రాంతీయ, కుల చిచ్చులను ఏపీ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరని.. రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అసెంబ్లీ సాక్షిగా తాను అమరావతిని రాజధానిగా బలపరిచిన విషయానికి కట్టుబడి ఉండాలని కోరారు. హైకోర్టు తీర్పును అమలు చేసి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఎప్పటికైనా గెలిచేది న్యాయం, ధర్మమే అని శ్రావణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Exit mobile version