NTV Telugu Site icon

ముగిసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల పర్యటన.. తిరుగు ప్రయాణం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాయి.. రెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు.. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చ‌క్రస్నానం ఘ‌ట్టంలో పాల్గొన్న ఆయన.. మూల విరాట్ అభిషేకం అనంత‌రం వీఐపీ విరామ స‌మ‌యంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.. ఆ తర్వాత రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు వేద పండితులు వేద ఆశీర్వచ‌నం ప‌లికి శేష‌వ‌స్త్రంతో స‌త్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర ప‌టం, 2022 క్యాలెండ‌ర్‌, టీటీడీ త‌యారుచేసిన అగ‌ర‌బ‌త్తుల‌ను అందజేశారు. ఈ పర్యటనలో సీజేఐ వెంట.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ జేకే మ‌హేశ్వరి, జ‌స్టిస్ హిమా కోహ్లి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయ‌మ‌యూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్యనారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరాజన్ తదితరులున్నారు. అనంతరం తన తిరుమల పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణం అయిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు రేణిగుంట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు అధికారులు.