తెలుగు రాష్ట్రాల్లో చంటిబిడ్డలను అమ్మకానికి పెడుతున్న ముఠాగుట్టు రట్టు చేసిన ఏలూరు పోలీసులు ఈవ్యవహారంతో సంబంధం ఉన్న వారందరిని విచారించే పనిలో పడ్డారు. ఇప్పటికే పది మంది ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలిసులు మరికొంతమంది పై నిఘాపెట్టారు. ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్స్ సిబ్బంది ఈవ్యవహారంలో పాలుపంచుకుంటున్నారనే విషయాన్ని గుర్తించిన పోలిసులు సంబందిత వ్యక్తలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కేసు విచారణలో భాగంగా ఏలూరు పోలిసులు గుంటూరులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలిక తన బావచేతిలో మోసపోయి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఏడో నెలలోనే మైనర్ బాలిక ప్రసవించడంతో పుట్టిన బిడ్డను అంగన్ వాడీ సహాయకురాలి ద్వారా విజయవాడకు చెందిన వ్యక్తిద్వారా అమ్మేసారు. శిశువు వివరాలు సేకరించేందుకు వెళ్ళిన శిశు సంరక్షణ అధికారులకు పాప కనిపించకపోవడంతో పోలిసుల సాయంతో ఎక్కడ ఉందనే వివరాలు సేకరించి శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈఘటనపై ఏలూరు దిశా పోలిస్టేషన్లో డిసిపివో కంప్లైయింట్ చేసారు.
పెదవేగి మండలానికి చెందిన నాగమణి అనే అంగన్ వాడి సహాయకురాలి ద్వారా రెండులక్షల 70వేలకు విజయవాడకు చెందిన టి.దుర్గ, గరికముక్కు విజయలక్ష్మీ, మాడవత్తి శారద, చిలకదుర్గాభవాని సహకారంతో గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన సయ్యద్ గౌసియాకు శిశువును విక్రయించినట్టు పోలిసులు గుర్తించారు. శిశువిక్రయంలో కీలక పాత్ర పోషించిన పదిమందిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. నిందితులు పనిచేసే వివిధ ఆసుపత్రుల నుంచి పిల్లలు లేని వారి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గుంటూరుకు చెందినకి ఆహల్య ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న పి.జాన్సీ విజయవాడకు చెందిన విజలక్ష్మీ, దుర్గభవాని అనే మహిళల ద్వారా అద్దె గర్భం ఇచ్చి పిల్లలను కని విక్రయించే వారని, పిల్లలు లేని వారికి పేద మహిళల నుంచి శిశువులను కొనుగోలు చేసేవారని పోలిసులు గుర్తించారు.
అయితే ఈకేసులో గుంటూరుకు చెందిన అహల్యా ఆసుపత్రి డాక్టర్ శనక్కాయల ఉమా శంకర్ ప్రమేయంకూడా ఉన్నట్టు పోలిసులు గుర్తించారు. ఆసుపత్రికి వచ్చే వారి వివరాలు బయటికి పొక్కడం, వారికి అవసరమైన రీతిలో చంటి బిడ్డల్ని అమ్మకాలు సాగించడంలో ఆసుపత్రి సిబ్బంది పాత్ర ఉన్నా డాక్టర్ ఉమాశంకర్ చూసీచూడనట్టుగా వ్యవహరించడాన్ని పోలిసులు సీరియస్ గా తీసుకున్నారు. పిల్లల అమ్మకంలో ఆయన పాత్ర ఎంతవరకు ఉందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.