Telugu Desham Party Chief Chandrababu Tribute to Freedom Fighter Alluri Sitarama Raju.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి నేడు. అయితే ఈ నేపథ్యంలోనే ఏపీలోని భీమవరంలో 30 అడుగుల సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని నేడు ప్రధాని మోడీ ఆవిష్కరించనున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సావాలు జరుపుకోవటం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణమన్నారు. అల్లూరి తన జీవితాంతం పోరాటంలోనే ఉన్నారని, చిన్న వయసులోనే బ్రిటిష్ వారిని గడగడలాడించారని కొనియాడారు. గిరిజనులందరిని సమీకరించి సాయుధ పోరాటంతో ముందుకు సాగారని, అల్లూరి పోరాటం తట్టుకోలేక ఆ రోజులోనే బ్రిటిష్ వారు ఆయన్ని చంపేందుకు రూ.40 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. 27 సంవత్సరాల వయసులోనే ఆయనను బ్రిటిష్ వారు అంతమొందించినా ఆయన పోరాటం శాశ్వతం నిలిచిపోయిందన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రాకున్నా.. 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామన్నారు.
ప్రధాని నిర్ణయాన్ని పార్టీ పరంగా స్వాగతిస్తున్నామని, పార్లమెంటులోనూ అల్లూరి విగ్రహాన్ని పెట్టాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా.. తెలుగు పౌరుషానికి, తెలుగువారి ధైర్య సాహసాలకు, త్యాగనిరతికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా… ప్రజల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన అల్లూరిని దేశం స్మరించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణమని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కృషి మూలంగా నాటి వాజ్ పేయి ప్రభుత్వం అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ హాల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ప్రభుత్వాలు మారడంతో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా తెలుగువారి ఆకాంక్షను నెరవేర్చాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నానన్నారు.