Site icon NTV Telugu

Chandrababu: జగన్ ప్రభుత్వం అసమర్థతకు పోలవరం ప్రాజెక్టు బలి

అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెకును జగన్ నాశనం చేశారన్నారు. డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా టీడీపీపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి.. విదేశీ విద్య వరకు టీడీపీ తెచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ రోజు ప్రజలు ఫలితాలు చూస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బడుగు, బలహీనవర్గాలకు జగన్ చేసిందేమీ లేకున్నా.. వారిని రాజకీయంగా వాడుకుంటూ టీడీపీపై వ్యతిరేకత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమం చేసినందుకు.. నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదనేలా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడమేంటని నిలదీశారు. స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు చోరీ చేయడం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిందని చంద్రబాబు తెలిపారు. నేరస్తులకు కొత్త కొత్తగా నేరాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం మార్గాలు చూపిస్తోందన్నారు.

కాగా టీడీపీ మెంబర్ షిప్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపాదికగా పూర్తి చేయాలని ముఖ్య నేతలకు చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం… గ్రామ స్థాయిలో అన్ని కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణమన్నారు. కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమన్నారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి నోటీసులతో వేధించడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.

Somu Veerraju: టీచర్లకు వేసవికాలంలో కాకుండా వర్షాకాలంలో సెలవులు ఇస్తారా?

Exit mobile version