NTV Telugu Site icon

ఏకపక్షంగా జిల్లాల విభజన : చంద్రబాబు

ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారన్నారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, స‌మ‌స్యలు త‌లెత్తేలా నిర్ణయాలు ఉండ‌కూడ‌దన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను ఎవ‌రు గౌర‌వించినా స్వాగ‌తిస్తామన్నారు. ఎన్టీఆర్ కేవ‌లం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదు.. ఆయ‌న‌కు భార‌తర‌త్న ఇవ్వాల‌ని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్నారు.

హైద‌రాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొల‌గించారని, వైఎస్ పేరు క‌డ‌ప జిల్లాకు పెట్టిన‌ప్పుడు వ్యతిరేకించ‌లేదన్నారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండ‌వు. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ స్మృతి వ‌నం ప్రాజెక్టును నిలిపేశారు. ఎన్టీఆరుపై త‌మ‌కు ప్రేమ ఉంద‌ని చెప్పే ప్రయ‌త్నాన్ని ప్రజ‌లు న‌మ్మరు. చివ‌రికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీల‌ను కూడా జ‌గ‌న్ నిలిపివేయడం నిజం కాదా..?అని ఆయన ప్రశ్నించారు.