Site icon NTV Telugu

కొండ‌ప‌ల్లి మున్సిపాల్టీ ఫలితాలపై చంద్రబాబు సమీక్ష…

ఇటీవల ఎన్నిక‌లు జ‌రిగిన కొండ‌ప‌ల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నిక‌ల్లో పోటీ చేసినా, పని చేసిన కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌కు చంద్ర‌బాబు అభినంద‌న‌లు తెలిపారు. కొండ‌ప‌ల్లి ఎన్నిక‌ల్లో ఎంపి కేశినేని పాత్ర‌పై చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు కురిపించారు. నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశార‌న్న బాబు… స‌మ‌ర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల న‌ష్టం జ‌రిగింద‌న్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు.

అయితే ఇక‌పై నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నుంచి స‌మ‌ర్థుల‌కే పెద్ద పీట. నేటి రాజ‌కీయాలు పూర్తిగా మారిపోయాయి. వైసీపీ అక్రమాల కారణంగా జగ్గయ్యపేటలో పార్టీ టెక్నికలుగా ఓడిపోయింది. వైసీపీ నాయకులు డబ్బు, అధికార బలంతో ప్రభుత్వ అధికారులను ప్రలోభ పెట్టి టీడీపీ గెలిచే అవకాశం ఉన్న వార్డుల్లో రీకౌంటింగ్ కూడా అవకాశం లేకుండా చేశారు. ఇన్ ఛార్జ్ శ్రీరాం తాతయ్య, నెట్టెం రఘురాంలు రీకౌంటింగ్ కు గట్టిగా పట్టుపట్టినా అధికారులు అవకాశం ఇవ్వలేదు. దీంతో జగ్గయ్యపేటలో మూడు వార్డుల్లో టీడీపీ ఓడిపోయింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కౌంటింగ్ హాల్ లోకి వెళ్లి టీడీపీ గెలిచిన 13వ వార్డులో మూడు సార్లు రీకౌంటింగ్ పెట్టి 6 ఓట్లు మెజారిటీతో వైసీపీ గెలిచినట్లుగా ప్రకటించుకున్నారు. జగ్గయ్యపేటలో టిడిపి అభ్యర్ధులు గెలిచి ఓడారు. వైసీపీ అక్రమాలను ఎదిరించి పోరాడిన అభ్యర్ధులకు అభినందనలు. జగన్ అరాచకాలతో చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ప్రజలకు కష్టాలు వచ్చాయి. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేయాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version