ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఆయన ఖండించారు. లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలని, ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.
Read Also: ఉద్యోగులతో జనసంద్రంగా మారిన విజయవాడ.. ఎల్లుండి నుంచి పెన్‌డౌన్
రివర్స్ పీఆర్సీని జగన్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నియంతృత్వ పోకడలు వీడి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇది లక్షలాది ఉద్యోగులకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని నిలదీశారు. రాజకీయ పార్టీల నేతలను ఎలా గృహనిర్బంధాలు చేస్తున్నారో, ఉద్యోగులను కూడా అదే తరహాలో నిర్బంధిస్తుండడం జగన్ వైఖరిని స్పష్టం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు.
