Chandrababu Naidu: ఇటీవల గోదావరి వరదలకు పలు లంక గ్రామాల బాధితుల్లో కొందరు ఇంకా నిస్సహాయస్థితిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు దాతలకు పిలుపునిచ్చారు. వరద బాధితులకు కూరగాయలు, బియ్యం వితరణ చేయాలని దాతలను కోరారు. ఇటీవల కురిసిన వర్షాలు ప్రజలకు అపార నష్టాన్ని మిగిల్చాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్టలతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని.. మానవత్వాన్ని మరచిందని చంద్రబాబు ఆరోపించారు. మేత లేక పశువులు నకనకలాడుతున్నాయని.. వాటి కోసం ఎండుగడ్డిని దాతలు అందించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: Auto Driver Selfie Video: సెల్ఫీ వీడియో తీసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులు కూరగాయలు, బియ్యం దొరక్క ప్రజలు, పసి బిడ్డలు దుర్భర స్థితిలో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇళ్లల్లోకి పూర్తిగా నీరు చేరి 4 నుంచి 7 రోజులు నిల్వ ఉండిపోయాయని… ఇళ్లలో బురద చేరిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాన్లు, టీవీలతోపాటు ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు పనికి రాకుండా పోయిన దృశ్యాలు తన పర్యటనలో చూశానని చంద్రబాబు వివరించారు. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం బాధ్యత మరిచిందని విమర్శలు చేశారు. అలాంటప్పుడు బాధితుల్ని సమాజం, మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని కోరారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ కొంత మేరకు సాయం అందించిందని.. ఇంకా సాయం కొనసాగిస్తోందని చంద్రబాబు తెలిపారు. తక్షణం పశువులకు ఎండుగడ్డి అవసరం ఎక్కువగా ఉందని.. దాతలు వారి పేరుతో గానీ, టీడీపీ ద్వారా గాని ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు. అలాగే కూరగాయలు, బియ్యం కూడా అందించాలని దాతలను కోరుతున్నట్లు చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎన్‌ఆర్‌ఐలు సాధ్యమైనంత వరకు ప్రజలకు కూరగాయలు, బియ్యం.. పశువులకు ఎండుగడ్డి వితరణ చేయాలన్నారు.