CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా

  • కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం: చంద్రబాబు
  • తమ్ముళ్ల బీమా కోసం రూ.150 కోట్లు ఖర్చు
  • కేంద్ర సహకారంతో గాడిలో పడిన ఏపీ ఆర్థిక వ్యవస్థ
  • 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
Tdp

Tdp

CM Chandrababu :  తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మోసింది, మోస్తోంది, ముందుముందు మోయబోయేది కేవలం పార్టీ కార్యకర్తలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెదేపా మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సాధించిన ప్రతి విజయానికి కారకులైన తమ్ముళ్లకు (కార్యకర్తలకు) తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని భావోద్వేగంగా ప్రకటించారు. కార్యకర్తల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, వారి బీమా సౌకర్యం కోసమే ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతిపై కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్‌పైకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వ సాయంతో తాము ఆక్సిజన్ అందించి మళ్లీ గాడిలో పెట్టామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వ సమర్థవంతమైన విధానాల వల్ల కేవలం 23 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించగలిగామని సీఎం చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు.

×
×
Ad