Site icon NTV Telugu

Chandrababu: లోకేశ్‌తో పాటు అందరికీ అవకాశం

Chandrababu On Legacy Politics

Chandrababu On Legacy Politics

వారసత్వ రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే! పార్టీ పగ్గాలు దాదాపు వారసులకే దక్కుతాయి. తరతరాలుగా రాజకీయాల్లో కొనసాగుతోన్న సంస్కృతి ఇది. ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలు నారా లోకేశ్‌కే దక్కుతాయని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతలు అదే చెప్తూ వస్తున్నారు. అయితే.. వారసత్వం ఒక్కటే పరమావధి కాదని, కష్టపడి పని చేసే తత్వం ఉన్న వాళ్ళకే అవకాశం దక్కుతుందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

ది ప్రింట్ క‌ర‌స్పాండెంట్ రిషిక స‌ద‌మ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు.. ఈ సందర్భంగా లోకేశ్‌కు పార్టీ ప‌గ్గాలు ఇచ్చే విష‌యంతో పాటు భావి తరాల నేతల సత్తాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పగ్గాలు స్వీకరించే అవకాశం లోకేశ్‌తో పాటు పార్టీలో పని చేసే ప్రతి ఒక్క యువకుడికీ ఉంటుందని చెప్పారు. ఇదే టైంలో.. త‌రాలు మారుతున్నకొద్దీ నేత‌ల్లో స‌త్తా త‌గ్గిపోతోంద‌ని కూడా ఆయన బాంబ్ పేల్చారు. త‌మ త‌రంలో ఎక్కువ మందిలో స‌త్తా ఉంటే.. త‌ర్వాతి త‌రంలో అలాంటి స‌త్తా క‌లిగిన నేత‌లు త‌గ్గిపోయార‌ని, ఆ త‌ర్వాతి త‌రంలో అది మ‌రింత‌గా త‌గ్గిపోతోంద‌ని పేర్కొన్నారు.

2024 ఎన్నికల్లో అధికారం ద‌క్కించుకునే దిశ‌గానే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే పొత్తుల గురించి మాట్లాడిన ఆయన.. పొత్తు అనేది రెండు పార్టీల మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరిన‌ప్పుడే సాధ్యపడుతుందని, ఎన్నికల సమయంలోనే పొత్తులన్నీ ఏర్పడుతాయని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ.. ప్రజల మద్దతు ఉన్న పార్టీలదే విజయం తథ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Exit mobile version