Modi, Chandrababu Meeting: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంట్రల్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులతో చంద్రబాబు ముచ్చటించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ భేటీకి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కమిటీ సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును చంద్రబాబు కలిశారు. సుమారు అరగంట పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు కూడా ద్రౌపది ముర్మును కలిశారు.
అటు రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం జరిగిన ఈ భేటీలో చాలా కాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. భేటీ ముగిశాక అందరూ వెళుతున్న సమయంలో చంద్రబాబుతో మోదీ ఏకాంతంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చంద్రబాబు ఏకాంత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు ఐదు నిమిషాల పాటు చర్చించుకున్నట్లు సమాచారం అందుతోంది. వీరి చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత మోదీ, చంద్రబాబు కలవడం ఇదే తొలిసారి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాని మోదీ, చంద్రబాబు భేటీ పలువురిలో ఉత్కంఠ రేపుతోంది. కాగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారీగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అటు ఆదివారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు.