CM Chandrababu : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగాలి

  • జెడ్పీ, ఎంపీపీ స్థానాలన్నీ కూటమి ఖాతాలో పడాలన్న సీఎం
  • మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్‌పై హర్షం
  • టికెట్లు దక్కని నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం
  • ఎన్నికల ప్రక్రియపై నిరంతరం దృష్టి పెట్టాలని నేతలకు ఆదేశం
Cm Chandrababu

Cm Chandrababu

ఇటీవల ముగిసిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపునకు రాత్రింబవళ్లు కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. త్వరలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా ఇదే తరహా విజయకేతనం ఎగురవేయాలని, రాష్ట్రంలోని అన్ని జెడ్పీలు, ఎంపీపీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు

గత రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, వేగవంతమైన అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు తమ ఓటుతో సరైన గుర్తింపు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. “గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్” అనేది కూటమి ప్రభుత్వ ప్రాథమిక విధానమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేస్తే వారు ప్రతి స్థాయిలోనూ గుర్తిస్తారని, వెన్నంటి ఉంటారనే విషయాన్ని ఈ పట్టణ స్థానిక సంస్థల ఫలితాలు మరోసారి స్పష్టంగా నిరూపించాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని గుర్తించి, మంచి పాలనకు అండగా ఉంటామని ప్రజలు ఈ తీర్పు ద్వారా చాటి చెప్పారని అన్నారు.

94 శాతం స్ట్రైక్ రేట్.. సీటు రానివారికి నామినేటెడ్ పదవులు

పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి ఏకంగా 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఓడిపోయిన కొన్ని స్థానాల్లో కూడా కూటమికి చెందిన రెబెల్ అభ్యర్థులే గెలిచారని, స్థానికంగా ఉన్న చిన్నపాటి సమన్వయ లోపాల వల్లే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చిందని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో టికెట్లు లేదా సీట్లు దక్కించుకోలేకపోయిన నాయకులకు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో తగిన న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.