అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో.. ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణుపై దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసీపీ మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే.. సీఎం మౌనం దేనికి సంకేతం..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్ టెండర్ల విధానంతో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారన్న చంద్రబాబు.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ మూడేళ్ల నిర్వహణా వైఫల్యమే కారణమన్నారు.
