NTV Telugu Site icon

Chandra Babu: రుషికొండపై జగన్ కన్నుపడితే.. అంతే సంగతులు..!!

Chandrababu 1 Min

Chandrababu 1 Min

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.

2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలని తాను ప్రణాళికలు రచిస్తే.. జగన్ రెడ్డి నాశనం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీ అవినీతి, అరాచకాలకు అడ్డాగా మారిందన్నారు. రుషికొండ ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని.. అక్కడ జగన్ కన్నుపడితే అంతే సంగతులు అని ఆరోపించారు. కోడికత్తి, బాబాయి హత్య వంటి ఆలోచనలతో జగన్ గెలిచారని ఎద్దేవా చేశారు. ఎవరికీ రాని ఆలోచనలు జగన్‌కు వస్తుంటాయని.. ఏపీలో వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా తయారయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక వాళ్లందరి తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని ఆటకెక్కించారని.. అగ్రిగోల్డ్ భూములను కొట్టేయడానికి పన్నాగం పన్నారని విమర్శలు చేశారు. జగన్ అమలు చేస్తున్న బాదుడే బాదుడుకు టీడీపీ ఒక్కటే విరుగుడు అని చంద్రబాబు ఉద్ఘాటించారు. జగన్‌ను నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు జైలు పాలవుతున్నారని, సీఎం కారణంగా 8 మంది అధికారులు జైలు శిక్షకు గురయ్యారని గుర్తుచేశారు.

Ambati Rambabu: చంద్రబాబే ఆ ప్రాజెక్ట్‌కి నష్టం కలిగించారు