ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న పరిస్థితులతో అక్కడ చదువుకునేందుకు వెళ్లిన ఏపీ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ సమావేశం నిర్వహించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకమని ఆయన విద్యార్థులకు సూచించారు.
పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోండని, టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే 2-3రోజులు ఎంతో కీలకమని, పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి మీ యోగక్షేమాల కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు.