Site icon NTV Telugu

పోలవరం బిల్లుల కోత.. ఏపీ సర్కార్‌కి ఇబ్బందులేనా?

ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి.

దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్‌ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి నీటిని మళ్లించేందుకు… మట్టి తవ్వకం పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులకు పెడుతున్న ఖర్చుని తమకు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. ఈ విషయంలోనూ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది.

ఈ మట్టి తవ్వకానికి గతంలోనే ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం చెబుతుండడంతో ఏం చేయాలో తోచక అల్లాడుతోంది జగన్ ప్రభుత్వం. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక ఇచ్చిన ప్రతి పైసాపై కేంద్రం పరిశీలన జరుపుతోంది. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సాగునీటి విభాగం కింద రూ.20,398.61 కోట్లు ఖర్చవుతుందని లెక్కలేశారు.

గతంలో ఆర్థికశాఖ వేసిన లెక్కల ప్రకారమే ప్రతి పైసా ఆచితూచి విడుదల చేస్తోంది. అంతకుమించి ఒక్క పైసా ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఏ పనులకు డబ్బులు అడిగినా అవి డీపీఆర్‌ పరిధిలోకి వస్తాయా రావా అన్న విషయాన్నీ కేంద్రం లోతుగా పరిశీలించాకే నిధులు విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం కింద కోత పెట్టిన రూ.4,068.43 కోట్లు ఎందుకు ఇవ్వాలో తెలిపేలా కేంద్రానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ రాయబోతోంది. ఈ నిధులు ఇచ్చేందుకు కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు చేసినా ఆర్థికశాఖలోని వ్యయ విభాగం తిరస్కరించింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఆయా వివరాలు అందించి, తమ వాదన వినిపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ప్రతిపైసా కేంద్రం ఇవ్వాలని ఏపీ పునర్విభజన చట్టం చెబుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో అంచనాలు మించిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.47,725.74 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదించి నిధులు ఇవ్వాలి. కానీ కేంద్రం పోలవరం నిధులను ఎంతవరకూ తగ్గించాలి, ఏ కారణం చెప్పి ఎంత కోత పెట్టాలా అనేదానిపై కసరత్తు జరుగుతోందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

పోలవరం విద్యుత్కేంద్రం మట్టి తవ్వకానికి సంబంధించి తాజాగా సమర్పించిన రూ.208 కోట్ల బిల్లులూ తిరస్కరణకు గురైనట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో బుడమేర మళ్లింపు, తదితర పనులకు ఇచ్చిన నిధులు కోత పెట్టుకుంటామంటూ కేంద్రం మెలిక పెడుతోంది. పోలవరం విద్యుత్కేంద్ర నిర్మాణానికి రూ.3,529.33 కోట్లే ఖర్చవుతాయని డీపీఆర్‌ లెక్కలు పేర్కొంటున్నాయి. విద్యుత్కేంద్రం ఖర్చురూపంలో రూ.4,560.91 కోట్లు మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. ఆ తేడా రూ.1,031.58 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. 2020 అక్టోబరు నుంచి పోలవరం నిధులపై కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే. వివాదాలు పరిష్కారం కాక.. నిధులు విడుదల కాక ప్రాజెక్టు పనుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

Exit mobile version