Site icon NTV Telugu

Y+ Category to Ramachandra Yadav: అమిత్‌షాను కలిసిన ఏపీ పారిశ్రామికవేత్తకు వై+ కేటగిరి భద్రత..

Ramachandra Yadav

Ramachandra Yadav

Y+ Category to Ramachandra Yadav: ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరు పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రత కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీ నుంచి రేపు పుంగనూరుకు చేరుకోనున్నారు భద్రతా సిబ్బంది… 2022 డిసెంబర్ 4వ తేదీన వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతు భేరి బహిరంగసభను అనుమతి లేకపోవడంతో అడ్డుకున్నారు పోలీసులు.. అదే రోజు రాత్రి తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి.. తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడ్డారని.. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు రామచంద్ర యాదవ్.. ఆ సమావేశంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన అమిత్‌షా.. 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా వై+ కేటగిరి భద్రత మంజూరు చేశారు.. ఇక, తనకు వై+ కేటగిరి భద్రత కేటాయించినందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్..

Read Also: Chaganti Koteswara Rao: చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ కీలక పదవి..

కాగా, రామచంద్ర యాదవ్‌. 2019లో జనసేన పార్టీ అభ్యర్థిగా పుంగనూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు వచ్చిన ఓట్లు 16 వేల 452. ఓడినప్పటికీ జనసేనకు దూరం జరిగి.. పుంగనూరు వేదికగా తన రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రామచంద్రయాదవ్‌ చేస్తున్న కార్యక్రమాలు చినికి చినికి గాలివానగా మారిపోయాయి.. ఏ కార్యక్రమం తలపెట్టినా మలుపులు తిరుగుతూ హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఒకసారి జాబ్‌మేళ అని మరోసారి యోగా గురువు రాందేవ్‌బాబాతో గృహప్రవేశం అని తెగ హంగామా చేసిన రామచంద్రయాదవ్‌కు స్థానిక వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతూనే ఉన్నారు. గత నెలలో రామచంద్రయాదవ్‌ పుంగనూరులో రైతు సమస్యలపై రైతుభేరి నిర్వహించాలని అనుకున్నారు. రైతు భేరికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. కానీ.. ఆయన అనుచరులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి.. ఎల్ఐసీ కాలనీలోని యాదవ్‌ కొత్త ఇంటికి వెళ్లారు. అంతవరకు బాగానే ఉంది. ర్యాలీ మొత్తం సీన్‌ మారిపోయింది. కొందరు వ్యక్తులు కర్రాలు, రాళ్లతో రాత్రివేళ రామచంద్ర యాదవ్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న కార్ల అద్దాలు పగులకొట్టారు. వైసీపీ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడ్డారని.. ఓ నేత ఆదేశాలతోనే ఈ దాడులు జరిగాయని.. పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఫైర్‌ అయ్యారు. దీనికి రామచంద్ర యాదవ్‌ ప్రత్యర్థులు సోషల్‌ మీడియాలో ఝలక్‌ ఇచ్చారు.

అయితే, అందరికీ షాక్‌ ఇస్తూ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు రామచంద్రయాదవ్‌.. అదీ బీజేపీ అగ్రనేత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలవడం పెద్ద చర్చగా మారింది.. గల్లీలో జరిగిన గొడవను ఢిల్లీ దాకా తీసుకెళ్లడం.. అమిత్ షాకు అతను ఫిర్యాదు చేయడం పుంగనూరులో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అసలు ఓ నియోజకవర్గంలో ఎదిగీ ఎదగని నేతకు అమిత్ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం ఏంటి? అదీ 40 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడడం ఏంటి? అనే అనుమానాలు వ్యక్తం చేసినవారు లేకపోలేదు.. దేశంలో నెంబర్‌ 2గా ఉండే అమిత్ షాతో కలవడం అంటే అంత ఆషామాషీ కాదు. అలాంటిది నేరుగా ఆయన్ను రామచంద్ర యాదవ్‌ కలవడం చర్చగా మారింది.. మొత్తంగా ఆ భేటీలో ఇచ్చిన హామీ మేరకు రామచంద్రయాదవ్‌కు వై+ కేటగిరి భద్రతను కేటాయించింది కేంద్ర హోంశాఖ.

Exit mobile version