NTV Telugu Site icon

Andhra Pradesh Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. కేంద్రం మరోసారి స్పష్టీకరణ

Ap Special Status

Ap Special Status

Andhra Pradesh Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత విషయాలనే ప్రస్తావించింది. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని మరోసారి లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు బ‌దులుగా కేంద్రం ప‌న్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాల‌కు అద‌న‌పు నిధులు కేటాయించిన‌ట్లు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు.

Read Also: Minister Ambati Rambabu: పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదు

అటు ప్రత్యేకహోదా అంశంపై 15వ ఆర్ధిక సంఘం కూడా ఇవే సిఫారసులను చేసిందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామని ఆయన వివరించారు. ఇంకా విభ‌జ‌న చ‌ట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. వాటిని కూడా త్వరలోనే నెరవేరుస్తామని పేర్కొన్నారు. విభజన సమస్యలపై వివాదాల ప‌రిష్కారానికి రెండు రాష్ట్రాల‌తో ఇప్పటిదాకా 28 సార్లు సమావేశమైనట్లు నిత్యానంద‌రాయ్ తెలిపారు. కాగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను సాధిస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేంద్రానికి తమ అవసరం లేనందున డిమాండ్ చేయలేమని.. కానీ ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.