BV Raghavulu: దేశ రక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం సీపీఎం దేశ రక్షణ భేరి నిర్వహిస్తోంది. విజయనగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పాల్గొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపడుతోందని.. ఎందరో మంది వీరుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం అని బీజేపీ గుర్తించాలని బీవీ రాఘవులు సూచించారు. ఏనాడూ స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదా వారి నాయకులు పాల్గొనలేదని.. బ్రిటీష్ వాళ్లకు అనుకూలంగా పనిచేశారు తప్పా ఏనాడూ స్వాతంత్ర్య ఉద్యమంలో లేరని ఆరోపించారు. సావత్కర్ గొప్ప నాయకుడని మోదీ చెప్తున్నారని.. దేశ ద్రోహం చేసిన వాళ్ళు గొప్ప నాయకులు ఎలా అవుతారని బీవీ రాఘవులు ప్రశ్నించారు. స్వాతంత్య్ర సమరంలో వీరులైన వారసులే ఈ పండగ జరుపుకోవాలన్నారు. ద్రోహులే ఈ రోజు ఉత్సవాలు జరుపుతున్నారని.. వారికి అర్హత లేదని స్పష్టం చేశారు.
ఒకే భాషగా ఉన్న చైనా కలిసి ఉండటం గొప్ప కాదు అని.. వివిధ భాషలు, జాతులు కలిసి ఉన్న భారతదేశం గొప్ప అని బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. దేశాన్ని ఒకటిగా ఉంచటానికి బీజేపీ ప్రభుత్వం ఇష్టపడటం లేదన్నారు. మత తగాదా పెట్టి ఒకటి కాకుండా ఉండేందుకు పన్నాగం పన్నుతోందని మండిపడ్డారు. కలిసి కట్టుగా ఉంటే దేనినైనా ఎదిరించొచ్చని.. అందుకే బీజేపీ ప్రభుత్వం శక్తిని, బలాన్ని బలహీనం చేస్తుందన్నారు. ఒక వైపు దేశ ప్రజలను ముక్కలు చేస్తూ మరోవైపు మొనగాడు అంటూ మోదీ విదేశాలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు ఏ హక్కులను లేకుండా కేంద్రప్రభుత్వం పాలేరులుగా చేస్తుందని.. రాష్ట్రం వాళ్ళు అప్పులు చేసేందుకు అవకాశం లేకుండా ఆంక్షలు పెట్టేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు కావాలంటే బీజేపీ విధానాలను అమలు చేయాలని ఆదేశాలు ఇస్తుందన్నారు. అందుకు ఒక అడుగు ముందుకు వేసిన వైసీపీ ప్రభుత్వం రైతులకు మీటర్లు పెట్టేందుకు కార్యాచరణ చేపట్టిందన్నారు.
వంగి ఉన్నప్పుడు జేబులో పడిపోయిన డబ్బులు తీసుకుంటే వెనుక జేబులో నుండి డబ్బులు కొట్టేస్తారని.. జగన్ వ్యవహారం అలాగే ఉందని బీవీ రాఘవులు చురకలు అంటించారు. మోదీ ఏమి చెప్తే అదే చేయాలని జగన్ చూస్తున్నాడన్నారు. విద్యుత్ బిల్లుకు పార్లమెంట్‌లో వైసీపీ, టీడీపీ ఆమోదం తెలిపాయని.. తద్వారా ప్రైవేట్ వాళ్ల చేతుల్లోకి విద్యుత్ వెళ్ళిపోతుందన్నారు. దీపాలు పెట్టుకునే పురాతన జీవన విధానం మరలా వస్తుందని రాఘవులు జోస్యం చెప్పారు. 2000 సం. లో విద్యుత్ పోరాటం చేపట్టామని.. ఆ పోరాటం నుండి ఏ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్నారు. కొత్త చట్టం ప్రకారం విద్యుత్ ఛార్జీలని నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు లేదన్నారు. ఏపీలో మున్సిపాలిటీ దుస్థితికి దిగజారిపోతుందని.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేట్లు పెంచితే ఎన్టీఆర్ వాటిని అడ్డుకున్నాడని.. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను రక్షించాడని తెలిపారు.
Read Also: Talasani Srinivas Yadav: కొందరు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు.. మంచి చేస్తే విమర్శలా?
విభజన విధానాలు తీసుకొస్తూ ఫెడరల్ పద్ధతిని నాశనం చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఎన్నికలు వస్తాయని.. విజయనగరంలో ఉప శాసన సభాపతి స్వాగతం కోసమా హెలికాప్టర్‌తో పూలవర్షం కురిపించారన్నారు. రోజు రోజుకు ప్రజాస్వామ్య విలువలు దిగజరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పదవులను ప్రజా పాలన కోసం ఉపయోగించాలి కానీ పూలు జల్లడం కోసం కాదన్నారు. దోపిడీ కోసమే పదవులు అన్నట్టు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. సంతలో పశువుల కొన్నట్టు పదవులు కొంటున్నారని.. మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలో కాంగ్రెస్ వాళ్ళను కొనేశారని.. అలాంటప్పుడు ఓటు అనే వ్యవస్థ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చేసి వేరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యమా అని రాఘవులు నిలదీశారు. రాష్ట్రంలో డబ్బులు, రాజకీయం తెచ్చిందే చంద్రబాబు అని.. ఆయన రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారన్నారు. ప్రజాస్వామ్యం ఉంటేనే స్వాతంత్ర్యం ఉంటుందన్నారు. నియంత్రత్వం ఉంటే ఏమి ఉంటుందని.. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. విమర్శ చేసే హక్కు మనది అని… దానిని ఖండిస్తే వారే నాశనం అవుతారన్నారు.
ఆడవాళ్లకు దేశంలో ఎక్కడైనా రక్షణ ఉందా అని బీవీ రాఘవులు ప్రశ్నించారు. .ఆడవాళ్లపై అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయని.. ఇంకెక్కడ స్వాతంత్ర్యం వచ్చినట్లు అని నిలదీశారు. సామాజిక న్యాయానికి రక్షణ లేకుండా పోతుందన్నారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు కాదు జరపాల్సింది. ఆజాదీ కా సంకల్పం ఉత్సవాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చాలా అన్యాయంగా ఉందన్నారు. ఢిల్లీలో మాత్రం అధికార, ప్రతిపక్ష నాయకులు మాత్రమే ఒకటే రకంగా మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. ధరలు పెరుగుతున్నాయని. .ఆర్ధిక అభివృద్ధి వెనుకపడిపోతుందన్నారు. ఉత్తరాంధ్రలో ఉపాధి దొరుకుతుంది అంటే అది ఒక్క స్టీల్ ప్లాంట్ మాత్రమే అన్నారు. ఉత్తరాంధ్ర రాజధానిగా వస్తే ఉత్తరాంధ్రలో ఉన్న భూములు అన్ని కబ్జాకు గురవుతాయని రాఘవులు ఆరోపించారు. ఇక్కడ ప్రజలను కూడా తరిమేస్తారన్నారు. ఉత్తరాంధ్రలో ఏమి అభివృద్ధి జరిగిందని మంత్రి బొత్సను అడుగుతున్నానని.. రాష్ట్ర అభివృద్ధిని రక్షించుకోవడానికి అందరూ ఆలోచన చేయాలన్నారు. ప్రజా రాజకీయాలు కోసం అందరూ సిద్ధపడాలని కోరుకుంటున్నానని రాఘవులు వ్యాఖ్యానించారు.