NTV Telugu Site icon

Chintapally Murder: భార్య కళ్ళెదుటే ఘోరం

విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య కళ్ళ ఎదుటే భర్తను నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి చంపారు ప్రత్యర్ధులు. కిటుముల పంచాయతీ పరిధిలోని బూసిబంద గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

బూసిబంద గ్రామానికి చెందిన పాంగి సుమంత్ (50) తన భార్య రస్సు తో కలిసి పెదబయలు చుట్టాల ఇంటికి వెళ్లి శుక్రవారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో తన స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న సమీప బంధువులు సుమంత్‌ పై దాడి చేశారు. ఊరికి సమీపంలోని కొండ దిగుతున్న క్రమంలో వరుసకు బామ్మర్థులైన బచ్చేలవెనం గ్రామానికి చెందిన సిందేరి పెంటయ్య, నాగేశ్వరరావు లు మాటువేసి నాటు తుపాకితో కాల్చి, అనంతరం కత్తితో దాడిచేసి హతమొందించారు.

మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలను సేకరించి, మృతి చెందిన వ్యక్తి శవపంచనామా నిమిత్తం చింతపల్లికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. తన కళ్ళెదుటే భర్త దారుణ హత్యకు గురికావడంతో భార్య కన్నీరుమున్నీరవుతోంది.