Site icon NTV Telugu

Buggana Rajendranath: చంద్రబాబుది ఓ భ్రమ.. ఆయన కట్టాలనుకున్నది రాజధాని కాదు

ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు చేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టకుండా కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలని భావించారని ఆరోపించారు. ఆయన కట్టాలనుకున్నది రాజధాని కాదని.. నగరం మాత్రమే అని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో నాలుగైదు వందల ఏళ్ల నుంచి నగరాలను అభివృద్ధి చేస్తే.. చంద్రబాబు మాత్రం నాలుగైదేళ్లలోనే నగరం కట్టాలని చూశారని.. ఇది భ్రమ కాక మరేంటని బుగ్గన ప్రశ్నించారు.

ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం అందుకుందని.. అందుకే మూడు రాజధానులను తెరపైకి తీసుకువచ్చామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుందని.. ఒకరి హక్కును మరొకరు లాక్కోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో వెనకబడ్డాయని.. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలని రాజ్యాంగంలో ఉందని తెలిపారు. సమానత్వంపై దృష్టి పెట్టాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయని బుగ్గన తెలిపారు.

Exit mobile version