తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలో దారుణం చోటుచేసుకుంది. అన్నను చూసేందుకు తెలంగాణ నుంచి ఏపీ వచ్చిన ఓ చెల్లెలు దారుణ హత్యకు గురైంది. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలంలోని కన్నాపురం గ్రామానికి చెందిన కొవ్వాసి నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో తన అక్క దగ్గర నివసిస్తోంది. ఇటీవల అన్నను చూసేందుకు కన్నాపురం గ్రామానికి వచ్చింది.
అయితే కొవ్వాసి నంద భార్య రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాత్రి పూట ఫుల్లుగా మద్యం సేవించిన నంద.. ఇంటికి వస్తూ చికెన్ తెచ్చాడు. ఆరోగ్యం బాగోలేదని పడుకున్న చెల్లెలిని నిద్రలేపి చికెన్ వండమని బలవంతపెట్టాడు. ఆరోగ్యం బాగా లేకున్నా చికెన్ వండాల్సిందేనని హుకుం జారీ చేసి బయటకు వెళ్లిపోయాడు. అన్న బయటకు వెళ్లడంతో చెల్లెలు సోమమ్మ చికెన్ వండలేదు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగొచ్చిన నంద.. కోడికూర వడ్డించాలని ఆర్డర్ వేశాడు. చికెన్ వండలేదని చెల్లెలు చెప్పడంతో అన్న కోపంతో ఊగిపోయాడు. గొడ్డలితో దాడి చేయడానికి ప్రయత్నించగా సోమమ్మ బిగ్గరగా అరుస్తూ బయటకు పరుగెత్తింది. ఆమె వెంట పరుగెత్తిన అన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో సోమమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. కాగా వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
