Site icon NTV Telugu

Andhra Pradesh: దేవాదాయ శాఖలో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేక్

Simhachalam Temple Min

Simhachalam Temple Min

ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది.

రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండగా.. వివిధ మార్గాల్లో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. సింహాచలం వంటి దేవస్థానానికి వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా కళకళలాడే ఈ ఆలయాల్లో ఆచార, సంప్రదాయాల ప్రకారం ఉత్సవాల నిర్వహణ పెద్ద టాస్క్. ఈ పద్ధతులపై పూర్తిస్థాయి అవగాహన ఎండో మెంట్స్ అధికారులకు మాత్రమే ఉంటుంది. సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి.

అయితే నిబంధనల ప్రకారం ప్రధాన ఆలయాలకు ఎగ్జిక్యూటివ్ అధికారులుగా దేవాదాయ శాఖలో రీజనల్ జాయింట్ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కొరత వున్నప్పుడు మాత్రం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు అవకాశం కల్పించవచ్చు. రెవెన్యూ ఎండోమెంట్స్ నిబంధనల మేరకు 30శాతం మంది సిబ్బందికి డిప్యుటేషన్ ఇచ్చే వెసులుబాటు ఉందని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని రెవెన్యూ అధికారులు ఈవోలుగా నియమితులు అవుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘన సర్వసా ధరణమైపోయింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు మాత్రమే డిప్యుటేషన్‌పై ఎగ్జిక్యూటివ్ అధికారులుగా నియమానికి అర్హులు. అందుకు విరుద్ధంగా పలు ఆలయాలకు ఈవోలుగా రెవెన్యూ అధికారులు చక్రం తిప్పడం, వివాదాల్లో చిక్కుకోవడం కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో తమ అవకాశాలు దెబ్బతింటుంన్నాయని ఎండో మెంట్ అధికారులు న్యాయస్థానంను ఆశ్రయించారు. ఈ అంశంపై న్యాయస్థానంలో సుదీర్ఘ కాలంగా విచారణ జరిగింది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఈవోలుగా పని చేస్తున్న వారందరినీ సాగనంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలువురికి స్థానచలనం కలిగింది. ఈ జాబితాలో సింహచలం దేవస్థానం ఈవో సూర్యకళ పేరు వినిపిస్తోంది. వచ్చే నెల3న చందనోత్సవం జరగనుంది. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఉత్సవం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. చందనోత్సవం తర్వాత సింహాచలం ఈవో బదిలీ ఖాయంగానే కనిపిస్తోంది.

Mining Mafia: గుడివాడలో చెలరేగిపోతున్న మట్టి మాఫియా

 

Exit mobile version