Botsa Satyanarayana Satires On Chandrababu Comments: తనకు చివరి ఎన్నికలు ఇవేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా స్పందించారు. చంద్రబాబు చెప్పినట్టుగా.. ఆయన ‘చివరి’ కోరిక తప్పకుండా నెరవేరుతుందని పేర్కొన్నారు. పైన తథాస్తు దేవతలు ఉంటారని, చంద్రబాబు వ్యాఖ్యలకు ఆ దేవతలు ‘తథాస్తు’ అంటారని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు మూడుసార్లు అవకాశం ఇస్తే, అన్నిసార్లు ఆయన మోసం చేశారని విమర్శించారు. ఇకపై చంద్రబాబు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు. సానుభూతి కోసం అసెంబ్లీలో తన భార్యను కించపరిచారంటూ చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగానూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రకంగానూ చంద్రబాబు వ్యవహరించేవారని.. రాష్ట్రం బాగుపడాలంటే, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాత్రం.. కరువు కాటకాలు తప్పకుండా వస్తాయన్నారు. ఏపీ సీఎం జగన్‌ను, జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ‘హిట్లర్, ఈస్టిండియా కంపెనీ’లతో పోల్చారని.. ఆయన జాలి, దయ లేవని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు భార్యను ఎవరు అవమానించారో, అసెంబ్లీలో ఎవరు తప్పుగా మాట్లాడారో నిరూపించాలన్నారు. ఇలా అవమానిస్తే.. ఎవరూ హర్షించలేరని బొత్స వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో.. ఉద్యోగుల సమస్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన 11వ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. అందరూ మాట్లాడుకునే పీఆర్సీపై నిర్ణయంపై తీసుకున్నామని, ఇప్పుడు దాని వల్ల నష్టం వచ్చిందని చెప్పడం సరికాదని హితవు పలికారు. ఉద్యోగులు ఇప్పుడు 12వ పీఆర్సీ వేయమని కోరడంలో తప్పులేదన్న ఆయన.. ఏడాదికి 80వేల కోట్లు జీతాల రూపంలో ఖర్చుపెట్టాల్సి వస్తోందన్నారు. కొన్ని సమస్యల విషయంలో ఉద్యోగులు కోర్టుకు వెళుతున్నారని, దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయని.. అయితే ప్రభుత్వానికి ఉద్యోగుల కంటే రాష్ట్రంలోని ప్రజల సమస్యలే ముఖ్యమని స్పష్టం చేశారు. జగన్ మళ్ళీ సీఎం అవ్వడానికి ఉద్యోగులు కూడా సహకరించండి అంటే.. ఎన్నికల ప్రచారం చేయమని కాదని క్లారిటీ ఇచ్చారు. మనకు కోరికలు అపరిమితమైనవని, తీరే కోరికలు ఉంటే మంచిదని సూచించారు. ప్రభుత్వాలు సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాయని, ఉద్యోగులు తీరే సమస్యలపైనే ప్రభుత్వానికి డిమాండ్లు చేయాలని బొత్స సత్యనారాయణ సూచించారు.