Botsa satyanarayana fire on chandrababu:
విజయవాడలో ఈఏపీసెట్-2022 ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఏ విషయాన్ని అయినా క్షుణ్ణంగా అర్ధం చేసుకుని మాట్లాడాలని బొత్స సూచించారు. మీడియాలో వచ్చిన వార్తలు చూసి మాట్లాడితే ఎలా అని నిలదీశారు. పుస్తకాల డిమాండ్ గురించి ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలను ముందే అడిగామన్నారు. అయితే వాళ్లు డిమాండ్‌లో 20 శాతం మాత్రమే చెప్పారన్నారు. ప్రభుత్వం కఠినంగా ఉందని అర్ధమైన తర్వాత ఇప్పుడు ఇంకా పుస్తకాలు కావాలని అడుగుతున్నారన్నారు.
వరద బాధితులకు సహాయం చంద్రబాబు మాటలు చూస్తే ప్రజలు నవ్విపోతారని మంత్రి బొత్స చురకలు అంటించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వరద సహాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నారు. ముంపు మండలాల విషయంలో చంద్రబాబు తెలంగాణకు మద్దతు ఇస్తున్నాడా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబుకు పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి కాకుండా చూడాలనుకుంటున్నారని.. ప్రభుత్వం చేస్తున్న అప్పులు చీకట్లో చేస్తున్నవి కాదని.. తమ అప్పులపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సూచించారు. ఈడీ విచారణ వేయమనటానికి చంద్రబాబుకు బుద్ధి ఉందా అని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్ధికంగా నష్టపోవటానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.
Read Also: AP IAS Officer: కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించిన ఏపీ ఐఏఎస్ ఆఫీసర్
మరోవైపు పనిలో పనిగా మీడియాకు కూడా బొత్స క్లాస్ పీకారు. మీడియా కూడా వ్యవస్థలో భాగమని.. వ్యవస్థను బాగు చేయటానికి ప్రయత్నించాలని హితవు పలికారు. వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయటానికి ప్రయత్నం చేయవద్దన్నారు. తప్పులు ఉంటే చెప్పాలని.. తాము స్వాగతిస్తామన్నారు. అంతేకాని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. స్కూళ్ల విషయంలో కొన్ని సంఘాలే అడుగుతున్నాయంటే వాళ్ళకేం దుర్బుద్ధి ఉందో తనకేం తెలుసన్నారు. ఏ ఒక్క టీచరు లేదా ఉపాధ్యాయ సంఘాన్ని అయినా తన దగ్గరకు తీసుకువస్తే సమాధానం చెప్తానన్నారు. ప్రతి హైస్కూల్లోనూ ఒక హెడ్మాస్టర్, ఒక పీటీ టీచర్ ఉండాలని చెప్పిందే తాను అని బొత్స స్పష్టం చేశారు. ప్రతి స్కూల్‌లోనూ కచ్చితంగా ఇద్దరు టీచర్లు ఉండాలని తానే చెప్పానన్నారు. ఉపాధ్యాయ సంఘాలు అడగలేదని.. అసలు విద్యా విధానమే తప్పంటే ఎలా అన్నారు. ఇంకా మెరుగైన విధానం ఉంటే ప్రభుత్వం ముందుకు తీసుకురావాలని సూచించారు.