ఏపీకి మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలు ఉండాలని.. ఏ వ్యవస్థ అయినా వారి పరిధిలోనే పనిచేయాలని బొత్స వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సభలో మాట్లాడాల్సిందని బొత్స కామెంట్ చేశారు. దమ్ముంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరమని చెప్పాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీడీపీ వాళ్లకు ఉత్సాహంగా ఉంటే రాజీనామాలు చేయమని చెప్పాలన్నారు.
రాజధాని పరిధిలో మిగిలిన 7,300 ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు వస్తాయా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ఆక్రోశంతో, కడుపు మంటతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనలో సహజ మరణాలను కల్తీ మరణాలుగా చూపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారీ ఒక కులం హక్కు అని.. ఎక్కడైనా సారా తయారీ ఉంటే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్ కౌన్సిల్ రద్దు చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వ్యవస్థలపై మాట్లాడుతున్న చంద్రబాబు.. గతంలో సీబీఐని వద్దని చెప్పలేదా అని బొత్స సూటి ప్రశ్న వేశారు.