బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీలో వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకుని రాష్ట్ర పథకాలుగా జగన్ సర్కారు ప్రచారం చేసుకుంటోందని జీవీఎల్ మండిపడ్డారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత కేంద్రం నుంచి అత్యధిక నిధులు పొందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని జీవీఎల్ వెల్లడించారు. అయినా ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వైఫల్యం చెందుతోందని ఆయన విమర్శలు చేశారు.
Read Also: రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కేంద్ర పథకాలు అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని జీవీఎల్ తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినా… రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు రావడం లేదని ఆరోపించారు. వైసీపీ అసమర్ధత వల్లే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మరోవైపు వైసీపీ అంటే జీవీఎల్ కొత్త నిర్వచనం చెప్పారు. వైసీపీ అంటే ‘ఏమీ చేతకాని ప్రభుత్వం’ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఈనెల 28న విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు జీవీఎల్ వెల్లడించారు.
