బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికార పార్టీ యథేచ్చగా బెదరింపులకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో సహా బెదరింపులకు దిగుతున్నారని.. బీజేపీ మండల అధ్యక్షుడు రామకృష్ణా రెడ్డి కిడ్నాప్‌లో మంత్రి పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని.. 50 వాహనాలతో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్జి సినీ పక్కీలో రామకృష్ణా రెడ్డి నివాసానికి వెళ్లి బెదిరించి బలవంతంగా పార్టీలో చేర్చుకోవడం తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు.
ఇక, ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా అధికారి పార్టీ వాడుకుంటోందని ఫైర్ అయ్యారు జీవీఎల్.. బీజేపీ నాయకులను, కార్యకర్తలను అధికారి పార్టీ నేతలు, పోలీసులు కూడా బెదిరిస్తున్నారన్న ఆయన.. ఉప ఎన్నికలో బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలన్న అధికార పార్టీ అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో కూడా అనేక నిబంధనలను, సంప్రదాయాలను విస్మరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని.. హైకోర్టు కూడా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించినట్టు వెల్లడించారు బీజేపీ ఎంపీ జీవీఎల్.