NTV Telugu Site icon

AP Special Status: అది పొరపాటున చేర్చారు.. ఇప్పుడు లేదు..!

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల కోసం ఏర్పాటు చేసిన సమావేశం అజెండాలో మొదట ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి.. ఆ తర్వాత తొలగించింది కేంద్ర హోంశా శాఖ.. ఈ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రం హోంశాఖ సమావేశం అజెండాలో ప్రత్యేకహోదా అంశం పొరపాటున చేర్చారని తెలిపారు.. ఈనెల 17న జరిగే సమావేశం.. ఏపీ, తెలంగాణ మధ్య విభేదాల పరిష్కారం కోసమేనన్న ఆయన.. ప్రత్యేకహోదా అనేది ఉభయ రాష్ట్రాల మధ్య వివాదం కాదన్నారు. అనవసరంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెలంగాణ విభేదాలతో ముడిపెట్టొద్దు అని సూచించారు.

Read Also: COVID 19: మహమ్మారి అంతం అప్పుడే..!-డబ్ల్యూహెచ్‌వో

ఇక, ప్రత్యేక హోదా వ్యవస్థ ఇప్పుడు లేదని స్పష్టం చేశారు జీవీఎల్‌ నరసింహారావు.. అయినా, ప్రత్యేక హోదా కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు.. కేంద్రం, ఏపీకి పెంచి ఇచ్చిస్తున్న నిధులనే ముద్దుగా ప్రత్యేక హోదా అనుకోండి అని వ్యాఖ్యానించిన ఆయన.. విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు భర్తీ చేస్తోందన్నారు.. ఏపీకి కేంద్రం గ్రాంట్ నిధులు మూడు రెట్లు పెరిగి ఇప్పటికే 75 వేల కోట్ల రూపాయలు వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీల్లో చదువుకోలేదు.. అయినా, ఆర్థిక రంగంలో దిట్టగా ప్రపంచ వ్యాప్తంగా నరేంద్ర మోడీకి గుర్తింపు వస్తుందన్నారు జీవీఎల్‌ నరసింహారావు.