NTV Telugu Site icon

ఆత్మకూరు ఘటనపై బీజేపీ ఫోకస్..

ఆత్మకూరు ఘటనలో ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఏపీ బీజేపీ కార్యాచరణ సిద్దం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి మురళీధరన్ రేపు కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మురళీధరన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. కడప జైలులో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలను కేంద్ర మంత్రి మురళీధరన్ పరామర్శిస్తారు.


కడప పర్యటన అనంతరం నంద్యాలకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి పరామర్శించనున్నారు. ఈ నెల 25న కర్నూలు పార్లమెంటు జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో మురళీధరన్ పాల్గొననున్నారు. అయితే గతంలో ఆత్మకూరు ఘటనలో తమ పార్టీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపాలనే ప్రయత్నం జరిగిందని, పోలీసులే శ్రీకాంత్ రెడ్డిని రక్షించారని, అదే పోలీసులు శ్రీకాంత్‌రెడ్డిపై 307 సెక్షన్‌ కింద కేసు పెట్టారని సోము వీర్రాజు ఆక్షేపించారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని వెల్లడించారు.