రాజకీయాల్లో రెండు పార్టీలు భిన్న ధృవాలుగా వుంటాయి. అందునా అవి రెండూ కలిపి నడవడం అనేది జరగదు. కానీ ఒకే ఒక అంశం వారిని కలిపింది. అదే రాష్ట్రపతి ఎన్నిక. ఏపీలో టీడీపీ, బీజేపీ కలిపి నడవడం ఎప్పుడో ఆగిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి నడిచాయి. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీతో పాటు బీజేపీ కూడా ప్రభుత్వంలో చేరింది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందే బీజేపీ-టీడీపీ బంధానికి బీటలు వారాయి. ఎడమొహం-పెడమొహంగా రెండూ పక్షాలు కత్తులు దూసుకున్నాయి. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ బలహీనం అయింది. బీజేపీకి కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బీజేపీ నేతలు టీడీపీని దగ్గరకు రానీయలేదు. చంద్రబాబు మోడీని కలవాలని భావించినా అది సాధ్యం కాలేదు.
2019 తర్వాత బీజేపీ నేతలు-టీడీపీ నేతలు కలిసి ఒక వేదిక పంచుకున్నది కూడా లేదనే చెప్పాలి. తాజాగా నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఒక ఎన్నిక ఈ భిన్నధృవాలను కలిపిందనే చెప్పాలి. నువ్వాదరిన, నేనీదరిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ… అన్నట్టుగా బీజేపీ-టీడీపీలు జూలై 12వ తేదీన కలిశాయి. ఎన్టీయే రాష్ట్రపతి అభ్యర్థిని శ్రీమతి ద్రౌపది ముర్ముకి అధికార వైసీపీ మద్దతు తెలిపింది. అలాగే, అరుదుగా విపక్షం కూడా బీజేపీ బలపరిచిన అభ్యర్థికి తమవంతు మద్దతు ప్రకటించడం కీలక పరిణామంగానే చెప్పాలి. ఇటు బీజేపీ, అటు టీడీపీ, వైసీపీ మూడూ కలిపి రాష్ట్రపతి అభ్యర్థికి వెన్నుదన్నుగా నిలవడం విశేషంగా చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ గురించి అంతగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకంగా లేదు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన వెంటనే జగన్ ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చ్చారు. ఆ తర్వాత చంద్రబాబు తన నిర్ణయం ప్రకటించారు.
విజయవాడలో గేట్ వే హోటల్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి సమావేశం నిర్వహించారు. పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఎంతో కష్టపడి ఎదిగారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్మును బలపరచాలని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. గిరిజనులను, ఆదివాసీలను అభివృద్ధి చేయడం అరుదుగా జరుగుతుంటుందని అన్నారు. ఈ దిశగా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడం హర్షణీయమని ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికలో భాగస్వామ్యం కావడం అందరి అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు ప్రకటించడాన్ని బట్టి రెండు పార్టీల ఆలోచన ఒకటే అని తేలింది. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకి ఓటేస్తారని చంద్రబాబు ప్రకటించడంపై బీజేపీ నేతలు హర్షం ప్రకటించారు.
Telangana Floods : భారీ వర్షాలు.. పొంగుతున్న వాగులు, వంకలు..
చంద్రబాబు అంటే అంతెత్తున ఎగిరిపడే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చంద్రబాబుని పొగిడేశారు. ద్రౌపది ముర్ముకు అధికార పక్షం-ప్రతిపక్షం తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ మద్దతు పలికిన రాష్ట్రాలు ఏపీ, మిజోరాం మాత్రమేనని చంద్రబాబుతో అన్నారు జీవీఎల్. చంద్రబాబు ఆరోగ్య పరిరక్షణ ఉంగరం వివరాలు అడిగి తెలుసుకున్నారు సోము వీర్రాజు. ఇటు ఏపీ రాజకీయాల గురించి అంతగా పట్టించుకోని కిషన్ రెడ్డి కూడా ఈమధ్యకాలంలో రెండవసారి ఏపీకి వచ్చారు. ఈనెల 4వ తేదీన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి నాడు విగ్రహావిష్కరణ, మోడీ సభకు వచ్చారు. మళ్ళీ ఇవాళ అటు వైసీపీ, ఇటు టీడీపీ సమావేశానికి వచ్చారు కిషన్ రెడ్డి.
స్వాతంత్రం వచ్చాక మొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం దక్కింది. టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42 పార్టీలు దేశంలో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నాయి. మన పక్క రాష్ట్రం మహిళ రాష్ట్రపతి అభ్యర్థి కావటం అదృష్ఠం. గతంలో అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్ కు టీడీపీ మద్దతు ఇవ్వడం సంతోషం. చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అంటూ ప్రశంసించారు కిషన్ రెడ్డి. ఇటు ఏపీ బీజేపీ నేతలు, అటు తెలంగాణకు చెందిన బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం టీడీపీతో కలిసి కూర్చున్నారు. మొత్తం మీద వాడిపోయిన బంధం మళ్ళీ చిగురించినట్టయింది. ఈ బంధం మున్ముందు మరింతగా బలపడుతుందా? రాష్ట్రపతి ఎన్పికతోనే బంధం పూర్వవుతుందా? అనేది తేలాల్చి వుంది.
Draupadi Murmu: ద్రౌపది ముర్కుకి టీడీపీ మద్దతు.. ఆమెకు ఓటెయ్యాలని బాబు పిలుపు
