Site icon NTV Telugu

Andhra Pradesh: విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు.. త్వరలోనే భారీ ప్రాజెక్టు

Vishakapatnam

Vishakapatnam

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో విశాఖ అభివృద్ధికి నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు కేంద్రం కూడా విశాఖలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. త్వరలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా 8 బయో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేశామని.. విశాఖలో కూడా బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని కేంద్రమంత్రి వివరించారు. ఏపీ మెడ్ టెక్ జోన్ లిమిటెడ్ కి చెందిన బయోటెక్నాలజీ విభాగం నుంచి విశాఖలో బయోటెక్నాలజీ పార్కు ఏర్పాటు కోసం డీపీఆర్‌ అందిందని తెలిపారు.

ఈ ప్రతిపాదన ఆమోదం పొందిన వెంటనే బయోటెక్నాలజీ పార్కు కోసం బయో టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ రూ.30 కోట్ల వరకు గ్రాంట్ అందిస్తుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. ఈ అంశంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. బయోటెక్నాలజీ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో దేశంలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ హబ్‌గా విశాఖ ఆవిర్భవించడానికి సమయం ఆసన్నమైందన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అవసరమైన సాయం పొందడానికి తాను పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

Read Also: ISB @20 Years: హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ద్విదశాబ్ది వేడుకలు.. ముఖ్య అతిథిగా చంద్రబాబు

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లలో రెండు విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో ప్రారంభించినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ఇంక్యుబేషన్ సెంటర్లపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 75 ఇంక్యుబేషన్ సెంటర్లను మంజూరు చేయగా, మూడు బయో ఇంక్యుబేషన్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైనట్టు వెల్లడించారు.

Exit mobile version