ఓవైపు గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో నడుస్తుండగా.. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ కూడా అదే తరహాలో కార్యక్రమాన్ని తీసుకున్నారు.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలకు తుఫాను హెచ్చరికతో పాటు వైసీపీ నాయకులు వస్తున్నారు జాగ్రత్త అంటూ సెటైర్లు వేశారు.. వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తే జాలి పడే పరిస్థితి తెచ్చుకున్నారు.. ఎన్నికలు వస్తున్నాయని భయంతో గ్రామాల్లో గడపగడప తిరుగుతూ ఓట్లు అడుక్కునే పరిస్థితికి దిగజారాన్నారు. ఇక, వలంటీర్లను బ్లాక్ మెయిలర్లుగా తయారు చేశారు, వలంటీర్లు చెప్తే కానీ ఏ గ్రామానికి ఏం చేశారనేది ఎమ్మెల్యేకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సర్పంచ్ అకౌంట్‌లోని నిధులను దొంగతనంగా తీసుకున్నందుకు మీ సర్పంచులు మిమ్మల్ని తిట్టుకునే స్థాయికి తెచ్చుకున్నారని మండిపడ్డారు అఖిల ప్రియ.
పీకలదాకా గుంతల రోడ్లతో గ్రామాలన్నీ శ్మశానాలుగా మార్చేస్తున్నారు అంటూ వైసీపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు భూమా అఖిలప్రియ.. టీడీపీ నేతలు, మాజీ మంత్రుల అరెస్టులు, టీడీపీ కార్యకర్తల మీద కేసులు లాంటి కక్షసాధింపు తప్ప గ్రామాల్లో అభివృద్ధి జరిగిందిలేదని విమర్శించిన ఆమె.. మోటర్లకు మీటర్లు పెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారు.. రైతులు వైసీపీ నాయకుల మొఖాలు కూడా చూడరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ఉద్యోగాలు ఇస్తామని హామీలతో యువతను మోసం చేశారని దుయ్యబట్టిన భూమా అఖిల… ప్రజలకు కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తీసేసి ప్రజలు ఇబ్బంది పడుతుంటే సంతోషపడుతుంది వైసిపి ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రజలు బిచ్చం వేస్తే ఈ కుర్చీలో కూర్చున్న వైసీపీ నాయకులు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. ఇక, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీ నుంచి నేను ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి వస్తాను అని ప్రకటించారు.
మరోవైపు, పక్క రాష్ట్రంలో ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడి చంపేస్తే ఆ ప్రభుత్వం ఎన్‌కౌంటర్ చేసింది… మన సీఎం శభాష్ అని పొగిడారే తప్ప ఈ రాష్ట్రంలోని మహిళలపై ఎలాంటి అరాచకాలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు అఖిల ప్రియ.. మహిళలపై జరిగే అరాచకాలపై హోం మంత్రి తల్లులదే తప్పు అని చెప్పే స్థాయికి దిగజారారన్న ఆమె.. ఆడపిల్లలకు రక్షణ లేని ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులలో ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
