NTV Telugu Site icon

బద్వేల్‌లో రూటు మార్చిన బెట్టింగ్ రాయుళ్ళు!

బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు.

బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి గెలుపు కంటే బీజేపీకి ఎన్ని ఓట్లు పోలవుతాయి, బీజేపీ,కాంగ్రెస్ లకు డిపాజిట్ వస్తుందా రాదా అని పందేలు కాస్తున్నారు. బీజేపీకి 25 వేల ఓట్లు దాటతాయని పందెం కాస్తున్నారు పందెం రాయుళ్ళు. కేవలం రాజకీయ వర్గాలకు మాత్రమే పరిమితం అయింది ఈ బెట్టింగ్.

గతంలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా డిపాజిట్లు గల్లంతయిన ఈ పార్టీలకు ఇప్పుడు వేలల్లో ఓట్లు వస్తాయని బెట్టింగ్ రాయుళ్ళు పందేలు కాయడం ఆసక్తికరంగా మారింది. మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదని, బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక్క‌డ గెలుపు అధికార వైసీపీదే అన్న విష‌యంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఈ రెండు పార్టీల లో ఇక్క‌డ రెండవస్థానం ఎవరిది, గౌరవప్రదంగా ఓట్లఉ ఎవ‌రు సాధిస్తార‌న్న దానిపైనే ఇప్పుడు ఇక్క‌డ బెట్టింగులు జ‌రుగుతున్నాయి.

ఈ రెండు పార్టీల లో ఎవ‌రికి అయినా డిపాజిట్ ద‌క్కుతుందా ? బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వ‌స్తాయా ? ఎవరి బలం ఎంత? ఏ రాజకీయ పార్టీ రెపరెపలాడుతుంది? అనే కోణంలో ఇక్క‌డ బెట్టింగ్ లు న‌డుస్తున్నాయని తెలుస్తోంది. టీడీపీ అభిమానులు వైసీపీ, బీజేపీల కంటే కాంగ్రెస్ కు ఓట్లేస్తారని భావిస్తున్నారు.

బీజేపీకి ఓటు వేయకుండా ఏపీలో కమలం వాడిపోయిందని, ఇక్కడ అంత సీన్ లేద‌ని చెప్పేందుకు క‌సితో ఉన్నారని తెలుస్తోంది. జ‌న‌సేన ఓట్ల త‌మ‌కు ప‌డ‌తాయ‌ని బీజేపీ గంపెడు ఆశతో ఉంది. మ‌రి టీడీపీ ,జ‌న‌సేన ఓట్లు నిజంగానే బీజేపీ, కాంగ్రెస్ కు పడతాయా? వీళ్ళకి వేసినా వేస్టే అన్న భావనతో ఫ్యాన్ గుర్తుకి గుద్దేస్తారా అన్నది వేచి చూడాలి. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.

నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఓడిపోయే పార్టీలపై బెట్టింగులు జరగడం సమ్ థింగ్ స్పెషల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్క‌డ బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు వ‌స్తాయ‌న్న బెట్టింగ్‌లు ఎంతవరకూ నిజం అవుతాయో చూద్దాం.