Bengal Tiger: రూటు మార్చిన బెంగాల్ టైగర్.. మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ!

  • తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం
  • ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోన్న పెద్దపులి సంచారం
  • మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ
Bengal Tiger Movement

Bengal Tiger Movement

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. పోలవరం జిల్లాలో సంచరించిన బెంగాల్ టైగర్ తాజాగా రూటు మార్చుకుని.. తూర్పుగోదావరి జిల్లాలోకి మళ్లీ ప్రవేశించింది. కోరుకొండ మండలం కాపవరం పరిధిలోని పాండవుల మెట్టపై పెద్దపులి కనిపించినట్లు అధికారులు గుర్తించారు. పెద్దపులి మెడకు అమర్చిన ట్రాకింగ్ కాలర్ ద్వారా దాని కదలికలను అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి వరకు పోలవరం జిల్లా దేవీపట్నం మండలం రామదుర్గం కొండపై సంచరించిన ఈ పెద్దపులి, తాజాగా కోరుకొండ మండలంలోకి చేరింది. దీంతో రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

పెద్దపులి జనావాసాల సమీపంలో సంచరిస్తుండటంతో కోరుకొండ, కాపవరం, కోటి కేశవరం, శ్రీరంగపట్నం, మునగాల తదితర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, పాండవుల మెట్ట ప్రాంతాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులు ప్రజలు రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.