ఏపీలో రాజకీయం ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూ నడుస్తోంది. వైఎస్ వివేకా హత్య వెనుక సీఎం జగన్ హస్తం ఉండొచ్చని వివేకా అల్లుడు రాజశేఖర్ సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడంపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ టీడీపీ నేత చంద్రబాబు చేతిలో పావులుగా మారారని ఆయన ఆరోపించారు. దీంతో సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు.
ఈరోజు సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నారని.. రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని సజ్జల అంటారని అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. సజ్జల వంటి క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన… సజ్జల కామెంట్ల వీడియోను కూడా షేర్ చేశారు. మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా సజ్జలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నారాసుర చరిత్ర అని సిగ్గులేకుండా బురదజల్లారని.. ఆ రోజు చంద్రబాబు చేయించారని చెప్పడానికి లేని సిగ్గు, ఈరోజు మీ ఇంటి ఆడబిడ్డ సునీత జగనాసుర రక్తచరిత్ర బయటపెడితే వచ్చిందా అంటూ సజ్జలను నిలదీశారు.
