Site icon NTV Telugu

Atchannaidu: అయ్యన్న ఇంటిని కూల్చడం.. బలహీనవర్గాలపై దాడి వంటిదే

Atchannaidu

Atchannaidu

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిని కూల్చడం బలహీనవర్గాలపై దాడేనని ఆరోపించారు. ఈ అంశంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అసలు జగన్‌కు అయ్యన్న కుటుంబం చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి కుటుంబం సొంత భూములను ప్రభుత్వాలకు దానం చేసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారని అచ్చెన్నాయుడు తెలిపారు.

అయ్యన్నపాత్రుడు కావాల్సినన్ని అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం ఇంటిని నిర్మించుకున్నారని.. కానీ బలహీన వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడి కుటుంబం పట్ల ప్రభుత్వాధికారులు అమానుషంగా ప్రవర్తించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి వేళ ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంటిని కూల్చడాన్ని ప్రజలందరూ గమనించారని.. అధికారులకు రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా అని నిలదీశారు. అర్థరాత్రి ఇంటిని కూల్చడానికి నిమిషం ముందు నోటీసు ఇవ్వడంపై జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఐపీఎస్ అధికారి మణికంఠకు చట్టాలు తెలుసా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 300ఏ ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి కూల్చివేతలు వద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. ఈ ఆదేశాలు అమలు చేసే బాధ్యత అధికారులకు లేదా అని సూటిగా నిలదీశారు. ఐపీఎస్ మణికంఠ తల్లిదండ్రులు ప్రకాశం జిల్లాలో ఉంటారని.. వారి ఇంటిని అర్థరాత్రి వేళ జేసీబీలతో కూలిస్తే.. బాధ ఉండదా అని అచ్చెన్నాయుడు అన్నారు. మణికంఠ తల్లిదండ్రులకు కూడా లేఖ రాస్తామని.. ఇలాంటి పరిస్థితే వారికి వస్తే.. వారెంత బాధపడతారో లేఖలో ప్రస్తావిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Galla Aruna Kumari: నా రాజకీయ జీవితం ముగిసింది.. కానీ టీడీపీకే మద్దతు

Exit mobile version