Maha Shivaratri 2023: మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ).. శివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 3,800 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు 3,800 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.. ఈ ప్రత్యేక బస్సుల్లో కోటప్పకొండకు 675, శ్రీశైలానికి 650, కడప జిల్లా పొలతలకు 200, పట్టిసీమకు 100 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. అయితే, ప్రత్యేక బస్సులు అనగానే వెంటనే ప్రత్యేక చార్జీలు కూడా గుర్తుకు వస్తాయి.. కానీ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జిలే వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ తెలిపారు.. ఇక, ఏపీలోని 101 శైవక్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా ఉందని.. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయా శైవక్షేత్రాల్లో తాత్కాలిక బస్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు..
కాగా, శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి శైవ క్షేత్రాలు.. ఇవాళ తెల్లవారుజామునుంచే ఎక్కడ చూసినా ఆలయాల దగ్గర భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. ఇక, ప్రముఖ ఆలయాల సంగతి సరేసరి.. శ్రీశైలం, కోటప్పకొండ, పొలతల, మహానంది సహా.. శైవ క్షేత్రాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల రద్దీ దృష్ట్యా.. పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. ఇక, శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి.