Bandi Srinivasrao: ఏపీ ప్రభుత్వం ఇంకా జీతాలు ఇవ్వకపోవడంపై ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులు నెలంతా పని చేస్తే 31 తేదీన జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలీ కన్నా దారుణంగా ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు పాలు, కూరగాయల, బ్యాంకుల వాళ్ళ వద్ద కూడా లోకువ అయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. బ్యాంకులు కూడా ఉద్యోగులకు రుణాలు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. నెల జీతం రాకపోతే ఎన్నో ఇబ్బందులు ఉంటాయన్నారు. అలాంటిది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడితే ఎలా అని ప్రశ్నించారు.
ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు జీతాలని నోటిమాటగా చెప్పడమే కానీ అమల్లో లేదని బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ 62 ఏళ్లు ఉద్యోగ విరమణ వయస్సు వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకూ బదిలీ ప్రక్రియ చేపట్టాలన్నారు. జీపీఎఫ్ నిధులు ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోవడం ఏంటని నిలదీశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఉద్యోగులను సంక్షోభంలోకి ఎందుకు నెడుతున్నారని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు. సామాజిక పెన్షన్‌లను నెలలో ఒకటో తారీఖున ఇస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల్లో పెన్షనర్లను కూడా వృద్ధులకు ఇచ్చే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదని.. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదని స్పష్టం చేశారు.
Read Also: Rakul Preet Singh: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు
మరోవైపు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాల ప్రకటన ఉంటుంది. ప్రెసిడెంట్ సహా 20 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయి. జనవరి 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ, జనవరి 19వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ప్రకటన ఉంటుంది. విజయవాడ ఏపీ ఎన్జీవోస్ హోంలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది. నామినేషన్ ఫీజును రూ.500గా నిర్ణయించారు.
