పీఆర్సీ విషయంలో తమ డిమాండ్లు నెరవేర్చాని కోరుతూ మంగళవారం నుంచి ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. ఈ మేరకు తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్ ప్రకటించారు.. రేపటి నుంచి ఉమ్మడి జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం పాల్గొనటం లేదని స్పష్టం చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు జి.రవికుమార్ వెల్లడించారు.
Read Also: అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన… రౌడీషీటర్‌ను చితక్కొట్టిన మహిళలు
అయితే పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అతిగా మాట్లాడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాన్ని తెచ్చేది మేమే.. కూల్చేది మేమే అన్నట్లుగా ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏపీలో పదమూడు లక్షల మంది ఉద్యోగులున్నారని.. ఒక్కో ఉద్యోగికి ఐదు ఓట్లు ఉన్నాయంటూ ప్రభుత్వాన్ని బెదిరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ సార్ సార్ అంటూ ప్రభుత్వ పెద్దలను బతిమాలుకున్న ఆయన ఇప్పుడు ఒక్క సారిగా ఇలా మాట్లాడుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
