Site icon NTV Telugu

AP Tenth Paper Leak: నంద్యాలలోనూ పేపర్ లీక్ కలకలం.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

Paper Leak 1

Paper Leak 1

ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3 నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఎంఈవో శ్రీధర్‌రావు విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాఠశాల ఇన్విజిలేటర్, సూపర్‌వైజర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

కాగా పదో తరగతి పేపర్ లీక్ అయిందన్న ప్రచారంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. పేపర్ లీకేజీ వార్తలు నిజం కాదని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాన్ని వైరల్ చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన గంటన్నర తర్వాత ప్రశ్నాపత్రం బయటకొచ్చింది కాబట్టి లీక్‌గా పరిగణించలేమని తెలిపారు. పరీక్ష ఉదయం 9:30 గంటలకు మొదలైతే.. 11 గంటలకు పేపర్ లీక్ అనే ప్రచారం జరిగిందని.. ఉ.11 గంటలకు ఎవరో పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రశ్నా పత్రాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి ఉంటారన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండంలోని అంకిరెడ్డి పల్లి జెడ్పీ పాఠశాల నుంచి ప్రశ్నా పత్రం బయటకు వచ్చిందని గుర్తించామని.. సోషల్ మీడియాలో పేపరును వైరల్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ ఘటనలో చీఫ్ సూపర్ వైజర్, ఇన్విజిలెటర్లను బాధ్యులుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Andhra Prasesh: పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ కలకలం.. స్పందించిన కలెక్టర్

Exit mobile version