YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి

  • నామినేషన్ల ప్రక్రియపై జగన్ తీవ్ర ఆరోపణలు
  • ఎస్ఈసీ, పోలీసుల తీరుపై విమర్శలు
  • కేంద్ర బలగాలు దించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి
  • అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
Jagan

Jagan

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న అప్రజాస్వామిక పరిస్థితులపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ గవర్నర్‌కు సుదీర్ఘంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఎనిమిది చోట్లలో ఒక్క నామినేషన్ కూడా పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 19 చోట్లలో కేవలం 36 శాతం మాత్రమే నామినేషన్లు పడ్డాయని, కొన్నిచోట్ల రిటర్నింగ్ అధికారి (RO) ఆఫీసులోనే నామినేషన్ పత్రాలను చింపివేశారని ఆరోపించారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. గెలుస్తామనే నమ్మకం లేకే చంద్రబాబు ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఎస్ఈసీ తీరుపై ధ్వజం.. పోలీసుల వ్యవహారశైలిపై ఆగ్రహం

రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రభుత్వంతో లాలూచీ పడిందని వైఎస్ జగన్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా పనిచేసి కోర్టుల్లో మొట్టికాయలు తిన్న వ్యక్తినే ఇప్పుడు ఎస్ఈసీగా నియమించి ఎన్నికలు జరుపుతున్నారని మండిపడ్డారు. పైస్థాయి పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి ఊడిగం చేస్తుండగా, కిందిస్థాయి పోలీసులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన తమ పార్టీ నేతల దగ్గరి నుంచి పత్రాలు లాక్కుని చింపేయడమే కాకుండా, ఎదురు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పులివెందులలోనూ 40 వార్డులకు గాను కేవలం 20 చోట్లే నామినేషన్లు వేయనిచ్చారని, పోలీసులే స్వయంగా అడ్డుకుని ఏకంగా 550 మందిపై ‘అటెంప్ట్ టు మర్డర్’ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్నికల నాటికి వారందరినీ జైల్లో పెట్టే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

సుప్రీంకోర్టుకు వెళ్తాం.. కేంద్ర బలగాలు దించాలి

ఈ అక్రమాలన్నింటిపై గవర్నర్‌కు వివరించామని, ఆయన సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని జగన్ తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడానికి నామినేషన్ల ప్రక్రియను సెంట్రలైజ్ చేయాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు కేంద్ర బలగాలను రప్పించాలని కోరినట్లు చెప్పారు. అలాగే పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం పొందుతామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారికి భవిష్యత్తులో ప్రజలు, దేవుడు తగిన బుద్ధి చెబుతారని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ కూడా దాటే పరిస్థితి ఉండదని జోస్యం చెప్పారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, ఈరోజు వాళ్ళ టైమ్ కాబట్టి దాడులు చేస్తున్నారని.. రేపు మన ప్రభుత్వం వచ్చాక అన్నీ చూసుకుంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.