NTV Telugu Site icon

Goutham Reddy dies: ఏపీ మంత్రుల తీవ్ర సంతాపం

మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ …ఓ మంచి స్నేహితుడు.. అన్నను కోల్పోయానన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని పేర్కొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి తీవ్ర సానుభూతి వ్యక్తం చేశారు.

మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త బాధించింది. చిన్న వయస్సులోనే ఆయన మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం. మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. ఆయన అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడి రంగం అభివృద్ధి సాధించింది. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అన్నారు మంత్రి రామచంద్రారెడ్డి.

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు డిప్యూటీ CM నారాయణ స్వామి. చిన్నతనంలోనే గౌతమ్ రెడ్డి కేబినెట్లో ప్రత్యేక స్థానం పొందారన్నారు నారాయణ స్వామి. మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేష్, సోమిరెడ్డి సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణంపై చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని. చిన్న వయసులోనే ఆయన మరణం చాలా బాధాకరం. ఏపీ లో పెట్టుబడుల కోసం పరిశ్రమలు మరియు ఐటీ శాఖా మంత్రిగా ఎంతో కృషి చేస్తున్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. – నిన్నటి వరకు కూడా రాష్ర్టంలో పెట్టుబడుల కోసం దుబాయ్ లో పర్యటించిన మేకపాటి గౌతంరెడ్డి ఇక లేరు అనే వార్త కలచి వేసింది. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియపరిస్తున్నాను. గౌతమ్ రెడ్డి మరణం పార్టీ కి ప్రజలకు తీరని లోటు. తుది శ్వాస వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషిచేసిన గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా అన్నారు నాని.

మంత్రి మేకపాటి హఠాస్మరణంపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భ్రాంతి తెలిపారు. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాస్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ప్రకటనలో అన్నారు. చివరి నిముషం వరకు రాష్ట్ర శ్రేయస్సు కోసమే పాటుపడిన సహచరుడిని కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందన్నారు. ఆయన కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని , సానుభూతిని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.