NTV Telugu Site icon

Amaravati: హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం

సీఆర్డీఏ చట్టం, మూడు రాజధానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది.. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని తేల్చి చెప్పింది.. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని కూడా తీర్పు ఇచ్చింది. అధికారం లేనప్పుడు సీఆర్‌డీఏ చట్టం రద్దు కూడా కుదరదని తేల్చి చెప్పింది ధర్మాసనం. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, దీనిపై పై కోర్టుకు వెళ్లే విషయంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నాలుగేళ్లలో టీడీపీ చేయలేని పనులు మూడు నెలల్లో ఎలా చేయాలో ఒక్కసారి ఆలోచించాలన్నారు బాలినేని.

Read Also: Russia-Ukraine War: ఆనంద్‌ మహీంద్రా కొత్త ప్లాన్..!

ఇక, వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణలో మ్యానిప్లేషన్ జరుగుతుందన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి… హత్య కేసులో న్యాయంగా విచారణ చెయ్యాల్సిన అవసరం ఉందన్న ఆయన.. వివేకా హత్య కేసుతో అవినాష్ రెడ్డికి సంబంధం లేదన్నారు.. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో 160 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.. ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలకు తెలుసన్న ఆయన.. చంద్రబాబు ముఖ్య మంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పాడు… చంద్రబాబు జీవితంలో అసెంబ్లీలోకి రాలేడని ఆరోజే మేం నిర్ణయించుకున్నాం అన్నారు మంత్రి బాలినేని.