NTV Telugu Site icon

బాబువి శవ రాజకీయాలు.. ఆయన కుట్రలను ప్రజలు గమనించాలి..!

Alla Nani

Alla Nani

టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి ఆళ్లనాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మూడు గంటల పాటు చేసిన దీక్ష చూసి ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని.. చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ఆయన అసలు స్వరూపం బయట పడిందని.. ఆయన పరిపాలన లో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతున్న సమయంలో తండ్రి, కొడుకులు హైదరాబాద్ లో జూమ్ మీటింగ్ పెట్టుకుంటూ కాలక్షేపం చేశారని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని.. ఉదయం 10 గంటలకు సుష్టుగా తిని… తిన్నది అరిగేంత వరకు ముఖ్యమంత్రిని తిట్టారని.. ఒంటి గంట అవ్వగానే ఇంటికి వెళ్లి తిని పొడుకోవటమేనా చంద్రబాబు దీక్ష ? ఈ దీక్షతో చంద్రబాబు సాధించింది ఏంటి ? అంటూ ప్రశ్నించారు.

ఇక, ప్యారాసెట్ మాల్.. ఐసీఎమ్మార్ గైడ్ లైన్స్ లో ఉందన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించిన మంత్రి ఆళ్ల నాని.. 12,700 మంది మాత్రమే చనిపోయారని చంద్రబాబుకు బాధగా ఉందా? తనను ఓడించారు కనుక లక్షల సంఖ్యలో జనాలు చచ్చిపోవాలనే అక్కసు ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబువి శవ రాజకీయాలు.. ఆయన కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.. మరోవైపు కోవిడ్ బాధితుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఫైర్ అయిన ఆయన.. పుష్కరాల సమయంలో సొంత ప్రచారం కోసం తొక్కిసలాట జరిగితే 10 లక్షల ముష్టి వేశారు.. అది కూడా నాలుగు నెలల తర్వాత అని.. మీ హయాంలో ఎవరికైనా 10 లక్షలకు మించి నష్ట పరిహారం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో ఓ వైద్యుడు అనారోగ్యం పాలైతే కోటిన్నర ఖర్చు పెట్టింది ప్రభుత్వం అని గుర్తుచేసిన మంత్రి.. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయలు ఇచ్చామని వెల్లడించారు.