Site icon NTV Telugu

AP JAC Amaravati: సర్కార్‌కు జేఏసీ షాక్‌.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..

Bopparaju

Bopparaju

AP JAC Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు ముగిసిన తర్వాత.. చల్లబడినట్టే కనిపించిన ఉద్యోగ సంఘాలు మళ్లీ ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి.. ఏపీ జేఏసీ అమరావతి అత్యవసర కార్యవర్గ సమావేశం ముగిసింది.. ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు.. మొత్తంగా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది ఏపీ జేఏసీ అమరావతి. ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.. మినిట్స్ కాపీలు ఇచ్చిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగించాలని అభిప్రాయపడింది అత్యవసర కార్యవర్గం. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు.. నేటి నుంచి మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. మా ఉద్యమాన్ని నిజాయితీగా కొనసాగిస్తాం.. ప్రభుత్వం కొన్ని అంశాలకు సానుకూలంగా స్పందించింది. అందుకే ఉద్యమ తీవ్రత తగ్గించి శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని వెల్లడించారు.

Read Also: Samantha: టీమ్ లో అమ్మాయిలు లేరా.. లేక సామ్ కన్నా గొప్పవారు లేరా..?

ఉద్యోగుల ఆవేదన చూసి అయినా ప్రభుత్వంలో మార్పు రావాలని కోరుతున్నాం అన్నారు బొప్పరాజు.. గతంలో చేసిన పోరాట ప్రణాళికలో చిన్న చిన్న మార్పులు చేశామని.. నేటి నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చే నెల 5వ తేదీ వరకు విధుల్లో పాల్గొంటాం అన్నారు. ఈనెల 17, 20 తేదీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సందర్శించి మద్దతు కోరతామన్న ఆయన.. ఈ నెల 21వ తేదీన సెల్‌ డౌన్ యథావిథిగా ఉంటుందన్నారు. 27వ తేదీన కారుణ్య నియామకాలు కోసం వారి కుటుంబం సభ్యులను కలుస్తాం. వచ్చే నెల ఐదో తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ నెల రోజుల అంశాలను మరో సారి చర్చించి కార్యాచరణ ప్రకటిస్తాం అన్నారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు.. కాగా, 21వ తేదీన సెల్‌ డౌన్‌ పేరుతో ప్రభుత్వ యాప్‌లను పనిచేయకుండా నిలిపివేశాలా కార్యాచరణ రూపొందించింది జేఏసీ.

Exit mobile version